దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు పండుగలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దళిత, నిషాద్ వర్గాల ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని జంగిల్ తికోనియా గ్రామంలో వంతంగియా సామాజిక వర్గ ప్రజలతో పండుగ చేసుకున్నారు. చిన్నారులకు మిఠాయిలు, కానుకలు పంపిణీ చేశారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని BJP రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉపముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. చెన్నై కోయంబేడులోని తన నివాసంలో కేంద్ర మాజీ మంత్రి ఎల్ మురుగన్ బాణసంచా కాల్చి పండుగ జరుపుకున్నారు. నటుడు రజినీకాంత్ తన అభిమానులకు అభివాదం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో భద్రతా సిబ్బంది గ్రామస్థులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ గ్రామాన్ని ఇటీవల నక్సల్స్ రహిత ప్రాంతంగా ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. తమిళనాడులోని కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అనంతరం లక్ష్మీ సరస్వతి సమేత కామాక్షి అమ్మవారిని రాజవీధుల్లో ఊరేగించారు. ఉత్తరాఖండ్‌లో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పలు ప్రాంతాల్లో నరకాసుర దహనం కార్యక్రమాలు నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com