ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ పిలుపు
ఐక్యరాజ్య సమితి వేదికగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐరాస సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ తొమ్మిదవ సమీక్ష సందర్భంగా భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేడి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎలాంటి సాకులు వెతకకుండా అన్ని దేశాలు కలిసి పోరాడాలని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని కోరారు. దశాబ్దాలుగా క్రాస్‌బోర్డర్ టెర్రరిజం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ భావజాలాన్ని సమూలంగా నిర్మూలించాలని పేర్కొన్నారు.
ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించేవారిని జవాబుదారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త టెక్నాలజీలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేయడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సాంకేతిక సాధనాలు వారి చేతికి అందకుండా చూడటంలో ఐరాస సభ్య దేశాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని హరీష్ పర్వతనేడి అన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక చట్టం దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదులకు ఇకపై ఎలాంటి రాయితీ లేదనే సంకేతం ప్రపంచ దేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com