స్వర్ణాంధ్ర 2047 కోసం దక్షిణ కొరియా భాగస్వామ్యం కోరిన నారా లోకేష్
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. సియోల్‌లో దక్షిణ కొరియా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల డిప్యూటీ మంత్రి కబ్‌జోన్ కాంగ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సహకారం కోసం లోకేష్ విజ్ఞప్తి చేశారు.
డీప్‌టెక్, సెమీ కండక్టర్లు, AI, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లీన్ టెక్, హెల్త్ టెక్ రంగాల్లో సాంకేతిక భాగస్వామ్యాన్ని కోరారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు, కొరియా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ, పోర్టులు, లాజిస్టిక్స్, నౌకా నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా కొరియన్ కంపెనీలను ఆహ్వానించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 6 పోర్టులు, 7 విమానాశ్రయాలు ఉన్నాయని, మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, కొత్త విమానాశ్రయాలు రానున్నాయని లోకేష్ వివరించారు. దీంతో హన్వా ఓషియన్ వంటి కొరియన్ దిగ్గజ సంస్థలకు గణనీయ అవకాశాలు లభిస్తాయన్నారు. విశ్వవిద్యాలయాల అనుసంధానం, విద్యార్థులు, ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, పాఠ్యప్రణాళిక అభివృద్ధి కోసం కూడా సహకారం అడిగారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు దక్షిణ కొరియాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం నిర్మించాలని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా నిలపడం, నాలెడ్జ్ ఎకనామీగా, దక్షిణాసియా లాజిస్టిక్స్, నౌకా నిర్మాణ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ఆయన వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com